January 6, 2009
శ్లో
దశకూప సమా వాపీ!
దశవాపి సమో హ్రదః!
దశహ్రద సమః పుత్రో!
దశపుత్రసమో ద్రుమః!!
అశ్వత్థ మేకం పిచుమన్ద మేకం!
న్యగ్రోధ మేకం దశతిన్త్రిణీకం!
కపిత్థ బిల్వా2మలకత్రయం చ!
పంచామ్రవాపీ నరకం న పశ్యేత్!! వృక్షాయుర్వేదం
పది నూతులతో సమానమొక దిగుడు బావి; పది బావులతో సమానము ఒక చెఱువు; పది చెఱువులతో సాటికి రాగలడు ఒక పుత్రుడు; పది మంది పుత్రులతో సమానమైన దొక్క మహా వృక్షము అని పెద్దలు చెపుతారు.
ఒక రావి చెట్టు, ఒక పిచుమంద వృక్షము, ఒక మర్రివృక్షము, పది చింతచెట్లు, వెలగ చెట్లు మూడు, మారేడులు మూడు, పెద్ద వుసిరిక చెట్లు మూడున్నూ, ఐదు మామిళ్లున్ను గల తోటను పెంచి, దానిలో నొక దిగుడుబావిని నిర్మించినవారు నరకమును చూడరు, అనగా స్వర్గమును చూరగొందురని భావము.
నేటి లౌకిక రాజ్యములో 'వనమహోత్సవము'ల వలె గాక పూర్వులు వాపీకూపతటాకములు ప్రతిష్ఠగావించి, వనములు పెంచుటలో విజయమును సాధించిరనుట గమనార్హము. వనములవల్ల సర్వజీవులకు కావలసినవన్నీ పుష్కలముగా లభించగలవనీ, వర్షమునకూ, భూసార పరిరక్షణకూ, ప్రజారోగ్యమునకూ చెట్లు ముఖ్యమనీ మన భారతీయులు, ఏనాడో గ్రహించి ఆచరణలో చూపిరి.
ఇటువంటి మంచి విషయాలు గూర్చి మనం తెలుసుకోవటం, మన పిల్లలు కూడా తెలుసుకొనేలా చేయటం ఎంతో ముఖ్యం, అనిపించింది. అందుకే ఈ ప్రస్థావన.
2 comments:
ఒక మనిషి వేరు మనిషికి శాయగల అత్యుత్తమ సేవ విద్యని అందించటమే. మన పూర్వులలోని ఋష్యంశ ప్రచోదనం చేయగా గురుతు పెట్టుకోవడానికి సులభమయ్యేలా ఇలా ఛందస్సులో బంధించి మనకు విద్యాదానం చేసినందుకు వారికి మనం ఎంతైనా ఋణపడ్డవారమే. ఆ ఋషిర్ణాన్ని తీర్చుకునే పద్ధతి వారి వారి కృతులు చదవడమే కాబట్టి ఆ అవకాశాన్ని ఇలా బ్లాగుద్వారా కలుగజేస్తున్న మీకు నా నమోవాకం.
ధన్యవాదాలు
Post a Comment