సత్యం బ్రూయా త్ప్రియం బ్రూయాత్

November 5, 2008

శ్లోII
సత్యం బ్రూయా త్ప్రియం బ్రూయాత్I
న బ్రూయా త్సత్య మప్రియంI
ప్రియం చ నానృతం బ్రూయాత్I
ఏష ధర్మ స్సనాతనఃII మనుస్మృతి


సత్యమునే పలుకుము; ప్రియమునే మాటాడుము; సత్యమైనను అప్రియమును పలుకకుము; ప్రియముగదా యని అనృతము నాడకుము.ఇదే సనాతన ధర్మము.
సత్యమేవ జయతే అన్నారు పెద్దలు.నన్నయ గారు భారతంలో శకుంతలోపాఖ్యాన ఘట్టంలో శకుంతల దుష్యంతునితో-- భరతుడు దుష్యంతుని కుమారుడే అని వివరిస్తూ-- సత్యవాక్కు యొక్క గొప్పదనాన్ని ఈ విధంగా చెప్తుంది.
చ.
నుతజలపూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త
త్సుతశతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడగన్. ౧-౯౪
క.
వెలయంగ నశ్వమేధం,బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపగ సత్యము, వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్.౧-౯౫
తే.
సర్వతీర్థాభిగమనంబు సర్వ వేద, సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
నెఱుఁగు మెల్లధర్మంబుల కెందుఁ బెద్ద,యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైనవారు. ౧-౯౬
క.
కావున సత్యము మిక్కిలి,గా విమల ప్రతిభఁ దలఁచి కణ్వాశ్రమ సం
భావిత సమయస్థితి దయఁ, గావింపుము గొడుకుఁజూడు కరుణాదృష్టిన్.౧-౯౭

అని అంటుంది.-ఎంత గొప్పగా చెప్పింది!

0 comments: