లాఙ్గూల చాలనమధశ్చరణావఘాతం

April 16, 2009

శ్లో
లాఙ్గూల చాలనమధశ్చరణావఘాతం
భూమౌ నిపత్య వదనోదర దర్శనం చ,
శ్వా పిణ్డదస్య కురుతే గజపుఙ్గవ స్తు
ధీరం విలోకయతి చాటుశతైశ్చ భుఙ్తే.౨౩
ఉ.
వాలముఁ ద్రిప్పు నేలఁబడి వక్త్రముఁ గుక్షియుఁ జూపుఁ గ్రిందటం
గాలిడుఁ ద్రవ్వుఁ బిండదుని కట్టెదుటన్ శునకంబు, భద్రశుం
డాలము శాలితండులగుడంబులు చాటువచశ్శతంబుచే
నోలి భుజించు ధైర్యగుణయుక్తిగఁ జూచు మహోన్నతస్థితిన్.

కుక్క తనకు పిండము పెట్టువాని యెదుట తోక ఆడించును, క్రిందబడి నోరు-పొట్ట జూపును, కాలుబెట్టి నేలను తోడును. ఏనుగు బియ్యము- బెల్లమును ప్రియవాక్యములచే క్రమముగ భుజించును. ధైర్యగుణముతో గంభీరముగ జూచును.

అది నిజమే. మా యింట్లో మేం పెంచుతున్న మూడు పామేరియన్ కుక్కలు కూడా ఈ పనులనన్నిటినీ ఇలాగే చేస్తూ ఉంటాయి. ఎంత గంభీరముగా ఉన్నా మంచిమాటలతో బియ్యాన్ని తింటున్నా గాని భర్తృహరి గారు చెప్పేరు కదాని ఏనుగును పెంచుకోలేం కదా. అలా చేస్తే మనం ఆ ఖర్చు భరించలేక మటాష్ అవటం మటుకు ఖాయం.

0 comments: