కి మ స్తిమాలాం కిము కౌస్తుభం వా

October 30, 2008

తిక్కన గారు ఆంధ్రమహాభారతం ఆంధ్రీకరించే సమయంలో విరాటపర్వం ప్రారంభంలో
మ.
హృదయాహ్లాది చతుర్థమూర్జిత కథోపేతంబు నానారసా
భ్యుదయోల్లాసి విరాటపర్వ మట యుద్యోగాదులుం గూడఁగాఁ
బదియేనింటిఁ దెనుంగుబాస జనసంప్రార్థ్యంబులై పెంపునం
దుది ముట్టన్ రచియించు టొప్పు బుధసంతోషంబు నిండారఁగన్.

అని,విరాట ఉద్యోగ పర్వాలతో ప్రారంభించి 15 పర్వాలను చివరివరకూ తెనుంగుబాసలో రచించుదామని సంకల్పం చెప్పుకుని తన ఈ ప్రబంధానికి అధినాథునిగా ఎవరిని పేర్కొందామా అని ఆలోచిస్తున్న సమయంలో ఆతని తండ్రి కొమ్మనదండనాథుడు ప్రత్యక్షమై --
తిక్కన అంతకు పూర్వం రచించిన ఓక శ్లోకానికి సంతసించిన వాడు, భక్తవత్సలుడు, ఐన హరిహరనాథుడు తనకు కలలో కనిపించి కృతిపతిత్వ మర్థించిన వాడై అక్కడకు వేంచేస్తున్నారని శలవివ్వడం,వెనువెంటనే హరిహరనాథుడు ప్రత్యక్షమయ్యి తిక్కన గారి ననుగ్రహించే ఘట్టంలో--
హరిహరనాథునకు అంత అత్యంత ప్రీతిని గూర్చిన ఆ శ్లోకం ఏమిటంటే--
శ్లో!!
"కి మ స్తిమాలాం కిము కౌస్తుభం వా!
పరిష్క్రియాయాం బహుమన్యసే త్వం!
కిం కాలకూటః కిము వా యశోదా!
స్తన్యం తవ స్వాదు వద ప్రభో! మే!!"

"ఓ పరమప్రభూ! అలంకరించుకోవటంలో నీకు పునుకల పేరులా లేక కౌస్తుభమణియా కావలసినది? నీకు కాలకూట విషమా లేక యశోదామాత స్తన్యమా,ఇష్టమైనది?నాకు, చెప్పు, ప్రభూ!"--ఇది హరిహరులకిద్దరకూ చెందిన స్తుతి.అందుచేతనే హరిహరనాథున కంతగా ప్రియమైనది.
తిక్కన గారు మహాభారతాన్ని తెనుగు బాస లోనికి అనువదించారు కాని తెలుగు భాష లోనికి కాదన్నమాట.

0 comments: