October 29, 2008
సంస్కృతభాషలో ఎన్నో ఎన్నెన్నో మంచి అందమైన శ్లోకాలు ఉన్నాయి.పూర్వుపు రోజుల్లో 100 శ్లోకాలు కంఠంస్థం చేస్తే ఆ వ్యక్తిని పండితుడుగా లెక్క కట్టేవారట.ఈ రోజులలో కూడా చదువుకునే విద్యార్థినీ విద్యార్థులలో ఎక్కువమంది మార్కులు ఎక్కువగా స్కోరు చేయవచ్చనే ఉద్దేశంతో సంస్కృత భాషని second language గా తీసుకొంటున్నారు.కారణం ఏదైనా ఈనాటి పిల్లలకు సంస్కృత భాష పట్ల ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం బ్లాగుల ద్వారా తెలుగుభాషపై పట్టుపెంచుకోవాలనే ఉత్సాహం చాలామందిలో కనిపిస్తోంది. అలానే రోజుకొకటి రెండు చొప్పున సంస్కృత శ్లోకాలు తాత్పర్యంతో సహా అందిస్తే నావరకూ నాకూ,ఇంకా చాలామంది ఇతరులకీ ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ కొత్త బ్లాగును ఈరోజు నుండీ ప్రారంభిస్తున్నాను.ప్రతి రోజూ ఓ మంచిమాట పేరుతో
లీలామోహనం గారు ప్రారంభించిన పోస్టు నా ఈ ప్రయత్నానికి ప్రేరణ.మహీధర జగన్మోహన రావు గారి సూక్తిముక్తావళి ఆధారంగా ఈ బ్లాగు నిర్వహించబడుతుంది. వారికి నే నెల్లప్పుడూ కృతఙ్ఞుడనై ఉంటాను.
సత్యం వద ధర్మం చర స్వాధ్యాయా న్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధన మాహృత్య ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సీః సత్యా న్న ప్రమదితవ్యం ధర్మా న్న ప్రమదితవ్యం కుశలా న్న ప్రమదితవ్యం భూత్యై న ప్రమదితవ్యం స్వాధ్యాయప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ యా న్య2నవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్య2స్మాకగ్ం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి యే కే చాస్మచ్ఛ్రేయాగ్ంసో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా2దేయం శ్రియా దేయం హ్రియా దేయం భియా దేయం సంవిదా దేయం అథ యదితే కర్మవిచిక్సితా వా వృత్తవిచిక్సితా వా స్యాత్ అథా2భ్యాఖ్యాతేషు యే తత్ర బ్రాహ్మణాః సమ్మర్శినః యుక్తా అయుక్తాః అలూక్షాః ధర్మకామాః స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏత దనుశాసనం ఏవ ముపాసితవ్యం ఏవము చైత దుపాస్యమ్.------తైత్తిరీయారణ్యకము
సత్యము పలుకుము,ధర్మము ననుష్ఠించుము.స్వాధ్యాయము నేమరకుము.గురువునకు ప్రియమగునట్లు ధనమార్జించి యిచ్చిన పిమ్మట వంశము నిలుపుటకై సత్సంతానమును బడయుము.సత్యము నేమరకుము.ధర్మమార్గమునుండి వైదొలగుకుము;కుశలము నుండి,కల్యాణకర్మలనుండి,సమృద్ధినుండి,స్వాధ్యాయప్రవచనములనుండి ప్రమాదము నొందకుము.దేవ పితృకర్మలను విడువకుము. తల్లియే దైవము.తండ్రియే దైవము.ఆచార్యుడే దైవము.అతిథియే దైవము అని వర్తింపుము.అనింద్యకర్మ లేవిగలవో వానినే గావింపుము.నింద్యకర్మలను చేయకుము.మాయందు ఏవి సుకర్మములో అవియే నీకు ఉపాస్యములు.ఇతరములు నీకు వర్జ్యములు. సత్పురుషులు ఎవరు మనకు శ్రేయస్కాములో వారిని సుఖాసీనులను చేసి సేదదీర్చి వారి బోధనల సారమును గ్రహింపుము.వారికి శ్రద్ధతో నీయదగును.అశ్రద్ధతో నీయకుము.హెచ్చుగా నియ్యలేదను సిగ్గుతో నిమ్ము.భయపడుతూ ఇమ్ము. సంపదకు తగినట్లు ఇమ్ము.నీకు ధర్మకర్మ సంశయము కలిగినచో పిలువబడినవారిలో ధర్మాధర్మ నిర్ణయసమర్ధులు,ఆచార్య పురుషులు, కర్మ స్వతంత్రులు, పరమసౌమ్యులు, ధర్మకాములు అగు బ్రాహ్మణు లెట్లాచరించిరో ఆ సందర్భములలో అట్లే ఆచరించదగినది సుమా. ఇది నీకు ఆదేశము,ఉపదేశము, ఇదే వేదరహస్యము. ఈశ్వరానుశాసనము.దీనిని ఆచరింపుము. ఇదియే ఆచరణీయము.
1 comments:
ఇంతటి మంచి విషయాన్ని మీ బ్లాగ్ ద్వారా పంచినందుకు ధన్యవాదాలు
Post a Comment