వేదమూల మిదం బ్రాహ్మం, భార్యామూల మిదం గృహం

April 12, 2010

వేదమూల మిదం బ్రాహ్మం, భార్యామూల మిదం గృహం,
కృషిమూల మిదం ధాన్యం, ధనమూల మిదం జగత్.

వేదములే బ్రాహ్మణత్వమునకు మూలము; గృహిణియే గృహమునకు మూలము ; కృషియే ధాన్యమున కుద్పాదకము ; ధనమే జగద్వ్యవహారమునకు మూలము.

"ధనమూల మిదం జగత్" అని మనమందరం సర్వసాధారణంగా వాడుతుంటాం, కాని ఆ నానుడి ఎక్కడినుంచి పుట్టిందో మనకు తెలియదు. ఈ శ్లోకమే ఆ నానుడికి ఆధారభూతమని తెలియటం తోటే ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేను.

అజగామ యదా లక్ష్మీః , నారికేళఫలాంబువత్,

March 15, 2010

శ్లోII

అజగామ యదా లక్ష్మీః , నారికేళఫలాంబువత్,
నిర్జగామ యదా లక్ష్మీః , గజభుక్తకపిత్థవత్.

సిరిసంపదలు తా వచ్చిన కొబ్బరికాయలోనికి నీరు వచ్చినట్లు తెలియకనే వచ్చును. అవి పోవడం కూడా ఏనుగు మింగిన వెలగపండులోని గుంజువలె కానరాకుండా హరించిపోతాయి.

ఇదే భావాన్ని మన సుమతీ శతక కారుడు కూడా

సిరి దాఁ వచ్చిన వచ్చును 
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయినఁ బోవును 
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ  107
ఈ పద్యం రెండో పాదంలో ప్రాస తప్పినట్లుందే !


బ్లాగ్మిత్రులందరికీ వికృతి నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు.

దాసీ మాన ధనం హంతి, హంతి వేశ్యా ధనాధికం,

March 6, 2010

శ్లోII
దాసీ మాన ధనం హంతి, హంతి వేశ్యా ధనాధికం,
ఆయూంషి విధవా హంతి, సర్వం హంతి పరాంగనా.

దాసీ స్త్రీతో సాంగత్యము మర్యాదను, వేశ్యాసంపర్కము ధనమును, విధవాస్త్రీతో సంపర్కము ఆయుష్షును, పరస్త్రీతో సంబంధము సర్వమును నశింపజేయును.

అందుచేత వివేకుడైనవాడు పైవాటినన్నింటినీ విడిచిపెట్టి కేవలమూ ఏకపత్నీవ్రతుడై యుండదగును. మనకు రామాయణం బోధించేది అదే.

పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో

January 22, 2010

శ్లో II
పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో,
మఠాపత్యం హ్యనృతవచనం సాక్షివాదః పరాన్నం,
బ్రహ్మద్వేషః ఖలజరతిః ప్రాణినాం నిర్దయత్వం,
మభూ దేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు.


ఓ పశుపతీ ! పౌరోహిత్యము, జాగరణము, గ్రామాధిపత్యము, నియోగము, మఠాధిపత్యము, అసత్యవాదిత్వము, సాక్షిగ బోవుట, పరాన్నభోజనము, బ్రాహ్మణ ద్వేషము, దుష్టసాంగత్యము, నిర్దయత్వము - యివి నాకు జన్మజన్మాంతరములకూ కలుగనీయవద్దు, స్వామీ !

ఏఏ విషయాలను వర్జిస్తూ ఉండాలో చక్కగా చెప్పబడింది. కాని అందరూ పైవాటినన్నింటినీ వర్జిస్తే ఆ యా పనులు చేసేవారెవరుంటారింక ?

ఆపదర్థం ధనం రక్షేత్, దారాన్ రక్షే ద్దనై రపి,

December 21, 2009

శ్లో II
ఆపదర్థం ధనం రక్షేత్, దారాన్ రక్షే ద్ధనై రపి,
ఆత్మానం సతతం రక్షేత్, దారై రపి ధనై రపి.

ఆపత్కాలము కొఱకై ధనమును భద్రపఱచుకొనవలెను. ఆ ధనములను వ్యయము చేసియైనను భార్యా పుత్రాదులను సంరక్షించుకొనవలెను. ధనము, కుటుంబము యీ రెండింటితోనూ తనను యెల్లప్పుడూ కాపాడుకొంటూండవలెను.

మనిషి యొక్క జీవనవిధానం ఇలా ఉండాలన్నమాట.